అందని ద్రాక్ష కానున్న అమెరికా ఉద్యోగాలు

0
110

డాలర్‌ కల చెదురుతోంది! అమెరికా కొలువులు ఇక అందని ద్రాక్ష కానున్నాయి. అక్కడ భారత విద్యార్థులకు, వర్క్‌ వీసాలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతోంది. మూడేళ్ల క్రితమే మొదలైన ఈ తేడా ఈ ఏడాది ఏకంగా రెట్టింపైంది. అమెరికాలో ఉద్యోగం చేయొచ్చన్న ఆశతో లక్షల సంఖ్యలో విద్యార్థులు వెళ్తున్నా.. ఆ దేశం ఏటా జారీ చేస్తున్న వర్క్‌ వీసాల సంఖ్య మాత్రం 85 వేలు దాటడం లేదు. దీంతో మున్ముందు ఉద్యోగాలు దొరక్క భారతీయ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను ఏటేటా పెంచుకోవడం ద్వారా గతేడాది అమెరికన్‌ విశ్వవిద్యాలయాలు 70 కోట్ల డాలర్ల టర్నోవర్‌ను దాటాయి. ఇలా అమెరికా ప్రభుత్వం ఓవైపు విద్యార్థులను ఆకర్షిస్తూనే మరోవైపు హెచ్‌1బీ వీసాలపై సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది. ప్రస్తుతం ఉన్న 85 వేల హెచ్‌1బీ వీసాల గరిష్ట పరిమితి భవిష్యత్‌లోనూ కొనసాగితే 2020 నుంచి ఏటా లక్ష మంది భారతీయులు అమెరికా నుంచి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుందని కొలంబియా బిజినెస్‌ స్కూల్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ సూరజ్‌ బజాజ్‌ అంచనా వేశారు. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఆ సంఖ్య పెరిగినా ఆశ్చర్యం లేదని అమెరికాలో బ్యాంకింగ్‌ నిపుణుడు శ్రీనివాసన్‌ రాధాకృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

వీసా గడువు ముగుస్తున్న దశలో రెన్యువల్‌ కోసం వస్తున్న దరఖాస్తులను కూడా యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యుఎస్‌సీఐఎస్‌) నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తోంది. హెచ్‌1బీ వీసాల జారీ, గడువు పొడిగింపు వంటి అంశాల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. హెచ్‌1బీ వీసా నిబంధనలను కచ్చితంగా అమలు చేసి తీరాలని 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే యూఎస్‌ విమానాశ్రయాల నుంచి విద్యార్థులను వెనక్కి పంపడం, హెచ్‌1బీ గడువు పెంపు కోసం వచ్చిన దరఖాస్తులను కఠిన పరిశీలన చేసి తిరస్కరించడం వంటి చర్యలు మొదలయ్యాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి