బోనమెత్తుదాం రండి

0
483

ఆషాఢమాసం… ఆధ్మాత్మిక ఆదివారం. ఆబాలగోపాలాన్ని పులకింపజేసే అద్భుత క్షణాలు… నాలుగు శతాబ్దాల మహోన్నత చారిత్రక ఈ వేడుక. విభిన్న  వర్గాలను, భిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత సాంస్కృతిక, సామూహిక ఉత్సవం బోనాల పండుగ. ఆదివారం గోల్కొండ జగదాంబిక బోనాలతో  ఆరంభమయ్యే వేడుకలకు నగరం సర్వం సన్నద్ధమైంది. అదేరోజు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం ప్రారంభం కానుంది. ఈ నెల 29, 30 తేదీల్లో మహంకాళి బోనాలు, రంగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ అధికారిక పండుగ అయిన బోనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు  చేపట్టింది. ఆ తరువాత లాల్‌దర్వాజ సింహవాహిని బోనాల వేడుక జరుగనుంది. ఈ వేడుకలతో పాటే నగరంలోని వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ జరుగనుంది. అన్ని ప్రధాన ఆలయాల్లో ఉత్సవాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయాన్ని అందంగా అలంకరిస్తున్నారు.

బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు బోనాల ఉత్సవాల దృష్ట్యా గోల్కొండ కోటలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. మొదటి రోజు సుమారు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు జగదాంబిక ఆలయ మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. శుక్రవారం స్థానిక మహిళలు మెట్ల పూజలు చేశారు. ఆలయానికి వెళ్లే అన్ని మెట్లను శుభ్రంగా కడిగి  పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. ఆలయం వద్ద భక్తులు బోనాలు సమర్పించేందుకు అనుగుణంగా వాటర్‌ప్రూఫ్‌ షెడ్‌లను ఏర్పాటు చేశారు. రామదాసు బందీఖానా, నగీనాబాగ్, తదితర ప్రాంతాల్లోనూ భక్తుల కోసం అదనంగా వాటర్‌ ప్రూఫ్‌ షెడ్‌లను ఏర్పాటు చేశారు. బోనాల ఉత్సవానికి సర్వం సన్నద్ధమైన గోల్కొండ కోటను రంగురంగుల విద్యుద్దీపాలతో  అందమైన  వెలుగుల కొండలా తీర్చిదిద్దారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి