మూడు ఎవరిదో

0
116

 ఫిఫా ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. నెల రోజుల నుంచి అభిమానులను అలరిస్తున్న మెగాటోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. టైటిల్ ఫేవరెట్ ఫ్రాన్స్, సంచలనాల క్రొయేషియా ఇప్పటికే ఫైనల్ ఫైట్‌లో నిలువగా, సెమీస్‌లో ఓటమి ఎదుర్కొన్న ఇంగ్లండ్, బెల్జియం మరోమారు తలపడేందుకు సర్వసన్నద్ధమయ్యాయి. బలబలాల పరంగా సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్లు మెగా టోర్నీకి ఘనంగా ముగింపు పలుకాలనే కసితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్, బెల్జియం మధ్య మూడో స్థానం కోసం జరిగే వర్గీకరణ పోరు అభిమానులకు పసందైన విందు అందించనుంది.

సెయింట్ పీటర్స్‌బర్గ్: ఇంగ్లండ్, బెల్జియం..ఇరు జట్లది ఒకటే ఆరాటం. ఘన చరిత్ర కల్గిన ఫిఫా ప్రపంచకప్ టోర్నీపై తమదైన ముద్రవేయాలన్నది. 1966లో సొంతగడ్డపై ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలువగా, 1986 ప్రపంచకప్‌ను బెల్జియం నాలుగో స్థానంతో ముగించింది. ఈసారైనా తమ కలల కప్‌ను కైవసం చేసుకుందామనుకుని మెగాటోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లండ్, బెల్జియం అంచనాలకు తగ్గట్లు వరుస మ్యాచ్‌ల్లో విజయాలతో అలరించాయి. ఒకే గ్రూపు(జీ)లో తలపడ్డ ఈ రెండు జట్ల ముఖాముఖి పోరులో బెల్జియంనే విజయం వరించింది. ప్రిక్వార్టర్, క్వార్టర్స్‌లో ప్రత్యర్థులపై విజయాలతో సెమీస్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ను క్రొయేషియా మట్టికరిపించగా, బెల్జియం ఆశలకు ఫ్రాన్స్ గండికొట్టింది. ఫైనల్ అవకాశాలను చేజార్చుకున్న ఈ యూరోప్ జట్లు టోర్నీని మూడో స్థానంతోనైనా ముగించాలన్న పట్టుదలతో ఉన్నాయి. లీగ్ దశలో తమకు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంగ్లిష్ జట్టు కత్తులు దూస్తుంటే..మరోమారు తమ సత్తాచాటాలన్న ఆవేశంతో రెడ్‌డెవిల్స్ ఉంది. దీంతో శనివారం సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేడియం అభిమానుల ఈలలు, కేరింతలతో హోరెత్తనుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి