వంశధారలో చిక్కుకున్న 53మంది సురక్షితం: బాబు అభినందన, ప్రమాదాలపై ఆందోళన

0
109


శ్రీకాకుళం: జిల్లాలోని సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం సమీపంలో వంశధార నదిలో చిక్కుకుపోయిన 53 మందిని సహాయ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. వంశధార నదీ గర్భంలో ఇసుకను తోడేందుకు వెళ్లిన కూలీలు, డ్రైవర్లు వరద కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. భారీ వరదలు: వంశధారలో చిక్కుకున్న 53మంది కూలీలు ఒక్కసారిగా వంశధార నదిలో వరద ప్రవాహం అధికం కావడంతో వీరంతా చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు సహాయచర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది చాలా సమయం పాటు శ్రమించి వారిందర్నీ ఒడ్డుకు చేర్చారు. బాధితులంతా క్షేమంగా ఒడ్డుకు చేరుకోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కాగా, వంశధార నదిలో చిక్కుకున్న 53 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. ఈ ఘటనపై సమాచారం తెలిసినప్పటి నుంచి ఆయన సహాయచర్యలను సమీక్షిస్తూనే ఉన్నారు. బాధితులు క్షేమంగా ఒడ్డుకు చేరుకోవడంతో చంద్రబాబు వారిని అభినందించారు. వరుస ప్రమాదాలపై ఆందోళన రాష్ట్రంలో పడవ ప్రమాదాలు మరో పెద్ద సమస్య మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జల సంరక్షణ, జల నియంత్రణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వంశధార వరదలో చిక్కుకున్న కూలీలను రక్షించిన సిబ్బందిని ఆయన అభినందించారు. విపత్తు నిర్వహణ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంగా పనిచేశారని… ఆర్టీజీ సకాలంలో స్పందించి అన్ని శాఖలను అప్రమత్తం చేసిందని… ఇదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా కనిపించాలని సూచించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి