ఆడితే ప్రశంసలు… ఆడకపోతే విమర్శలా!

0
121

లండన్: రెండో వన్డేలో పేలవ బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ ధోనీకి సారథి విరాట్ కోహ్లీ బాసటగా నిలిచాడు. పదివేల పరుగుల కోసమే చెత్తగా బ్యాటింగ్ చేశాడని అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలను అతను ఖండించాడు. ఇది కేవలం దురదృష్టం మాత్రమే. ధోనీపై పదేపదే విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థంకావడం లేదు. ఒక్క మ్యాచ్‌లో ఆడకపోతే తక్షణమే అతనిపై తుది నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ మహీ చాలా అనుభవజ్ఞుడు. కాకపోతే ఈ రోజు ఆ అనుభవం ఉపయోగపడలేదు. చాలాసార్లు చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. ఇప్పటికీ అతనే అత్యుత్తమ ఫినిషర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా ఆడలేకపోవచ్చు. అతని శక్తి సామర్థ్యాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది అని విరాట్ పునరుద్ఘాటించాడు. మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి మహీకి ఎలాంటి సందేశాలు పంపలేదని చాహల్ అన్నాడు. ధోనీ అలా ఆడటంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే తర్వాత ముగ్గురు బౌలర్లమే ఉన్నాం. నాతోపాటు కుల్దీప్, సిద్ధార్థ్‌కు బ్యాటింగ్ పెద్దగా రాదు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు బ్యాట్స్‌మన్ ఉండి ఉంటే పరిస్థితిలో మరోలా ఉండేంది. ధోనీ వేగంగా ఆడి ఔటైతే కనీసం 50 ఓవర్లు కూడా ఆడలేకపోయేవాళ్లం. భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు వికెట్లు కాపాడుకోవడం చాలా ముఖ్యం. కానీ కోహ్లీ ఔట్‌తో మేం కోలుకోలేకపోయాం అని చాహల్ వివరించాడు. మరోవైపు ఒక్క మ్యాచ్‌తో ఆటగాడి సత్తాను అంచనా వేయడం సరైంది కాదని టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆశిష్ నెహ్రా అన్నాడు. భారత్ కంటే ఇంగ్లండ్ మెరుగ్గా ఆడింది కాబట్టే విజయం వాళ్లను వరించిందన్నాడు. ఇందులో ఎవర్ని నిందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి