3జీ కూడా పనిచేయని దేశం మనది : కేజ్రీవాల్‌

0
100

భోపాల్‌ : ప్రపంచమంతా 5జీ నెట్‌వర్క్‌తో దూసుకుపోతుంటే మన ప్రధాని ఇంకా హిందూ, ముస్లిం అంటూ వ్యాఖ్యలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ప్రపంచ దేశాలు 5జీ నెట్‌వర్క్‌తో వేగంగా ముందుకు వెళ్తుంటే మన దేశంలో 3జీ కూడా సరిగ్గా పని చేయడంలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ముస్లింల పార్టీ అని ఇటీవల నరేంద్ర మోదీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్‌ దీనిపై స్పందించారు.. హిందూ, ముస్లిం అంటూ ప్రధాని మత వైషమ్యాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ల కాలంలో దేశంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

ప్రధాని వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా స్పందించారు. ముందస్తు ఎన్నికల కోసమే ప్రధాని హిందుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధానికి ఓటమి భయం పట్టుకుందని, త్వరలో జరుగునున్న రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దానికి ముందస్తు సూచనగానే కశ్మీర్‌లో పీడీపీతో తెగదెంపులు చేసుకున్నారని తెలిపారు. నిరుద్యోగ, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి అంశాలను ప్రధాని గాలికొదిలేశారని మాయావతి విమర్శించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి