4 జీబీ డేటా 3 వేల రూపాయలు

0
121

మొబైల్‌ ఇంటర్నెట్‌.. ప్రస్తుతం ఓ నిత్యావసరంగా మారిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనకబడిన దేశాలు కూడా ప్రస్తుతం మొబైల్‌ ఇంటర్నెట్‌ వ్యాప్తిని విస్తృతిస్తున్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి కనెక్ట్‌ అవడానికి కూడా మొబైల్‌ ఇంటర్నెటే ఓ సారథిలా ఉపయోగపడుతోంది. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ లగ్జరీగా ఉంది. చాలా మంది దీని యాక్సస్‌ను పొందలేకపోతున్నారు. దీనిలో కరేబియన్‌ దీవి క్యూబా ఒకటి. గత ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ.. క్యూబా ఎట్టకేలకు మొబైల్‌ ఇంటర్నెట్‌ను అందించడం ప్రారంభించింది. తొలిసారిగా ఎంపిక చేసిన యూజర్లకు అంటే ప్రభుత్వ రంగ న్యూస్‌ ఏజెన్సీ ఉద్యోగులు, రాయబారులకు మొబైల్‌ ఇంటర్నెట్‌ను అందిస్తోంది.  ఈ ఏడాది చివరి వరకు మొబైల్‌ ఫోన్‌ యూజర్లందరకూ ఇంటర్నెట్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా క్యూబా పనిచేస్తోంది కూడా. క్యూబన్‌ టెలికాం దిగ్గజం ఈటీఈసీఎస్‌ఏ ఈ సర్వీసులను అందజేస్తోంది.

అయితే ఆ దేశ టెలికాం మార్కెట్‌లో మోనోపలిగా సేవలందిస్తున్న ఈ సంస్థ, 4 జీబీ డేటాకు 45 డాలర్లు అంటే రూ.3 వేలను ఛార్జ్‌లుగా విధిస్తోంది. తన 50 లక్షల కస్టమర్లందరికీ ఇంటర్నెట్‌ యాక్సస్‌ను ఈటీఈసీఎస్‌ఏ కల్పిస్తుందని రిపోర్టు చెప్పాయి. అంటే దేశ జనాభాలో సగం శాతం. 2018 నాటికి దేశం మొత్తానికి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా గట్టిగా చెబుతోంది. వ్యాప్తి చెందుతున్న ఇంటర్నెట్‌ యాక్సస్‌తో, దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, ఈ విప్లవానికి క్యూబా ప్రజలు కూడా సాయం చేస్తారని క్యూబా అధ్యక్షుడు మిగ్యుఎల్ డియాజ్ కానెల్ చెప్పారు. 2013 వరకు క్యూబాలో ఇంటర్నెట్‌ కేవలం పర్యాటక హోటళ్లలోనే అందుబాటులో ఉంది. సైబర్‌ కేఫ్‌లు, పబ్లిక్‌ వై-ఫైలతో ఈ ఇంటర్నెట్‌ వ్యాప్తిని క్యూబా విస్తృతపరుస్తోంది. అయితే 5జీ టెక్నాలజీ వైపు ప్రపంచ దేశాలన్నీ దూసుకుపోతుంటే, 3జీ కనెక్టివిటీని అందించడానికే క్యూబా తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి