హైకోర్టును ఆశ్రయించిన పరిపూర్ణానంద స్వామి

0
113

హైదరాబాద్‌ : ఆరు నెలలపాటు నగర బహిష్కరణకు గురైన స్వామి పరిపూర్ణానంద స్వామి శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. తనపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పరిపూర్ణానంద దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. పిటిషన్‌లో ప్రతివాదిగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ను చేర్చారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. కత్తి మహేశ్‌ వ్యాఖ్యలకు నిరసనగా ‘ధర్మాగ్రహ యాత్ర’చేపడతానని ప్రకటించిన ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు జూలై 10న ఆయనకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో అడుగు పెట్టొద్దని, నోటీసులు అందుకున్న 24 గంటల్లో నగరాన్ని విడిచిపెట్టాలని అందులో పేర్కొన్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున స్వామిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీపీఠానికి తరలించాయి. పరిపూర్ణానంద స్వామి నగర బహిర్కణకు ముందే కత్తి మహేశ్‌ను కూడా ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన సంగతి విదితమే.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి