అంగన్‌వాడీ కేంద్రాల్లో మందులు కరువు

0
200

పొన్నలూరు: ఐదేళ్లలోపు చిన్నారులకు పోషకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందించి చిన్నారుల ఎదుగుదలకు దోహదపడాలనే లక్ష్యంతో స్థాపించిన అంగన్‌వాడీ కేంద్రాలు ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాయి. కేంద్రాల్లో సరైన వసతులు కల్పించకపోవడంతో పాటు చిన్నారులకు ఆరోగ్య సంరక్షణ కోసం అందించాల్సిన ప్రథమ చికిత్స కిట్లు సకాలంలో సరఫరా చేయకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసే మందులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆడుతూ పిల్లలు కిందపడి గాయాలపాలైతే కనీసం పూత మందు కూడా లేని పరిస్థితి. ప్రభుత్వం పంపిణీ చేసే ప్రథమ చికిత్స కిట్లు, మందులు రెండేళ్లుగా అందకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలోని 21 ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 4244 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో  మూడేళ్లలోపు చిన్నారులు 1,14,894 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 1,01,159 మంది ఉన్నారు. గర్భిణులు 44,978 మంది, బాలింతలు 45,240 మంది ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు జ్వరం, జలుబు, దగ్గు వంటి చిరువ్యాధులు సోకినప్పుడు తాత్కాలిక ఉపశమనం పొందడానికి మందులు, సిరప్‌ ఇవ్వాల్సి ఉంది. ఆ తరువాత అంగన్‌వాడీ కార్యకర్త చిన్నారులను ఆస్పత్రికి తీసుకెళ్లేలా వారి తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం మందుల కొరతతో అంగన్‌వాడీ కేంద్రాల్లో  ఇటువంటి పరిస్థితి లేదు. చివరిగా అంగన్‌వాడీ కేంద్రాలకు 2015 జూలై నెలలో మందుల కిట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు.

మందుల పరిస్థితి ఇదీ: అంగన్‌వాడీ కేంద్రాలకు రెండేళ్ల క్రితం సరఫరా చేసిన ప్రథమ చికిత్స సామగ్రిలోని అరకొర మందులనే నేటికీ అక్కడక్కడా కొన్ని సెంటర్లలో వినియోగిస్తున్నారు. మరి కొన్ని సెంటర్లలో తప్పనిసరి పరిస్థితుల్లో అంగన్‌వాడీ కార్యకర్తలే వారి సొంత డబ్బులతో కొనుగోలు చేసి వాడుతున్నారు. ఎక్కువ శాతం అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీసం రెండేళ్ల క్రితం ఇచ్చిన మందులు కూడా లేకపోవడం గమనార్హం. అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులు విరామ సమయాల్లో ఆడుకుని విశ్రాంతి పొందడానికి చాలా కేంద్రాల్లో అనువైన స్థలం లేదు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి