కీలక వడ్డీరేట్లు మళ్లీ పెరిగాయ్ పావుశాతం పెంచిన ఆర్బీఐ ముంబయి: వరుసగా రెండో సమీక్షలోనూ కీలక వడ్డీరేట్లను పెంచేసింది భారత రిజర్వ్ బ్యాంక్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశం జులై 30 నుంచి మూడు రోజుల పాటు జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా కీలక వడ్డీరేట్లను పావుశాతం మేర పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీని ప్రకారం.. ప్రస్తుతం 6.25శాతంగా ఉన్న రెపో రేటు 6.50శాతానికి పెరిగింది. ఇక రివర్స్ రెపో రేటును కూడా 6 శాతం నుంచి 6.25శాతానికి పెంచారు. ఇక ఎంఎస్ఎఫ్ రేటు, బ్యాంకు రేటను 6.75శాతంగా వెల్లడించింది. ఈసారి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉండొచ్చని కొందరు అంచనా వేశారు. అయితే చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపుకే ఆర్బీఐ మొగ్గుచూపింది. కాగా.. ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచడం వరుసగా ఇది రెండోసారి. జూన్లో జరిగిన రెండో ద్వైమాసిక సమీక్షలోనూ పావుశాతం మేర పెంచడం గమనార్హం.